ఓ కేటుగాడు సోషల్ మీడియాలో ధనవంతులైన అమ్మాయిలనే లక్ష్యంగా చేసుకొని, మాయచేసి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కొట్టేస్తున్నాడు. ఇప్పటిదాకా ఎంతోమంది అమ్మాయిలను మోసం చేశాడు ప్రాథమిక దర్యాప్తులోనే రూ. 2. 50 కోట్లు కాజేశాడని నిర్ధారించారు. బాధితుల్లో కొందరి ఫిర్యాదుతో నిందితుడిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సైబర్ క్రైం పోలీసుల వివరాల ప్రకారం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జోగడ వంశీకృష్ణ 2014లో బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చి కూకట్‌పల్లిలో ఉండేవాడు.
గుర్రపు పందాలు, క్రికెట్ బెట్టింగ్ వ్యవసనంలో మునిగిపోయాడు. ఇందుకు డబ్బు లు లేకపోవడంతో కూకట్‌పల్లిలో ఒక ప్రైవేట్ ట్రావెల్ కార్యాలయంలో పనిచేశాడు. ఆ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమందిని మోసం చేసి డబ్బు గుంజాడు. ఈ కేసులో ఓ 10 మందితో కలిసి జైలుకెళ్లొచ్చాడు. బయటకొచ్చాక ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా డబ్బున్న అమ్మాయిలను ఎరవేయాలని పథకం వేశాడు. అమ్మాయిల పేరుతో కొన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, హర్షవర్దన్ అనే పేరుతో ఓ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు క్రియేట్ చేశాడు.
అమ్మాయి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్టు పంపేవాడు. అలా ఎవరికి వారిని ఫాలోవర్స్‌గా మార్చుకొని వారితో స్నేహం పెంచుకునేవాడు. వారితో తాను కోటీశ్వరుడినని నమ్మించి. ఖర్చులకు వాడుకోండంటూ రూ. లక్ష మేర వారి ఖాతాల్లో వేసేవాడు. కొన్నాళ్ల తర్వాత ట్రాన్షక్షన్స్ అన్నీ ఆగిపోయాయని అర్జంటుగా డబ్బులు కావాలంటూ రూ. 10 నుంచి రూ. 50లక్షల వరకు అడిగేవాడు. దాంతో అతను చెప్పింది నిజం అని నమ్మిన అమ్మాయిలు రూ. లక్షల్లో అతడికి ఇచ్చేవారు. తనకు చాలా బ్యాంకు ఖాతాలుంటాయని అమ్మాయిలను వంశీకృష్ణ నమ్మించేవాడు. అయితే ఆ బ్యాంకు ఖాతాలన్నీ క్రికెట్ బెట్టింగ్, గుర్రుపు పందాలు నిర్వహించే ఆర్గనైజర్స్‌వే! వారి ఖాతాల్లో అమ్మాయిలు వేసిన డబ్బును తీసుకొని జల్సాలు చేసేవాడు. ఇలా రెండేళ్లలో సుమారు 1000 మంది అమ్మాయిలను మోసం చేసి, రూ. కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు 50 కేసులు నమోదు అయ్యాయి.