ధవిళేశ్వరం వద్ద గోదావరి బేరేజిపై రోడ్డు అంతంత మాత్రంగా వుంది. కొత్తగా మరో 9 మండలాల నుంచి అదనపు రద్దీ పెరగడం వల్ల రోడ్డు వేగంగా దెబ్బతినిపోతోంది.
పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాలలోని 9 మండలాల ప్రజలు జిల్లాల పునర్యవస్ధీకరణ వల్ల తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చారు. ఆ మండలాల వారు రాజమహేంద్రవరంలో బొమ్మూరు వద్ద వున్న జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాపోకలు సాగించాలంటే గోదావరి బేరేజి మీదుగా ప్రయాణించాలి. ఇందువల్ల బ్యారేజిపై బస్సులు, ఫోర్ వీలర్లు, టూ వీలర్ల లోడు బాగా పెరిగింది.
దీనికి తోడు వాడపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి కొంత కాలంగా రద్దీ పెరిగింది. ఇదంతా బేరేజిపై రోడ్డు వేగంగా పాడైపోడానికి కారణమౌతోంది. తాత్కాలిక మరమ్మతుల వల్ల పెద్దగా ప్రయోజనం వుండకపోవచ్చు. ఇది బేరేజి మీద వున్న రోడ్డు కనుక వాహనాల లోడుని లెక్కవేసి పటిష్టమైన రిపేర్ల చేయించడానికి ప్రాధాన్యత ఇవ్వవలసి వుంది.