రాజమహేంద్రవరంను పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి కోసం నిర్దేశించుకున్న ప్రణాళికలపై రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో ఎంపి మార్గని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగర పరిధిలో రూ. 125 కోట్లతో చేపట్టవలసిన 16 పనులపై సమగ్రంగా చర్చించడం జరిగిందన్నారు. పై పనులను చేపట్టడంలో భాగంగా విడుదలైన రూ. 15 కోట్ల తో చేపట్ట వలసిన పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
నగరంలో ట్రాఫిక్ సమస్య నివారణ చర్యలు తీసుకోవాలసి ఉందన్నారు. నాగుల చేరువ ప్రాంతం, కోటిపల్లి బస్టాండ్, రైల్వే అండర్ బ్రిడ్జి, కోటగుమ్మం, మోరంపూడి, విటి కాలేజ్ రోడ్, గోదావరి రివర్ బండ్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలపై అధికారులతో సమీక్షించారు. భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా నగరంలో అభివృద్ధి పనులు చేపడుతూనే, ట్రాఫిక్ సమస్య లేకుండా అడుగులు వెయ్యల్సి ఉందన్నారు. ఆర్ వో బి, ఫ్లై ఓవర్ బ్రిడ్జి, ఫుట్ వే బ్రిడ్జి నిర్మాణ పనుల సూచనలు చెయ్యడం జరిగిందన్నారు.
నాగుల చేరువు వద్ద పురపాలక స్టేడియంలో క్రికెట్, ఇండోర్ స్టేడియం, ఇతర క్రీడల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. కంబాల చెరువు ను మరింత అభివృద్ధి చేసి నగరంలో ఆకర్షణీయ ప్రదేశంగా తీర్చి దిద్దడం పై సమావేశం లో అన్ని కోణాల్లో సమగ్రంగా అధ్యయనం చేశారు. ఇండోర్ స్టేడియం, కంబాల చెరువు సమగ్ర అభివృద్ధి కార్యాచరణ, ఈట్ స్ట్రీట్, రివర్ ఫ్రంట్ బండ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, తదితర అంశాలపై సమావేశంలో సుధీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు.