ఫ్లెక్స్ ల నిషేధ నిర్ణయాన్ని పునరాలోచించాలని రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బుడ్డిగ రాధాకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఇకపై ఫ్లెక్స్ లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో 35 ఫ్లెక్స్ మిషన్స్ ఉన్నాయని, ఒక్కొక్క దాంట్లో ఐదుగురు చొప్పున పనిచేస్తున్నారని, వారిపై కుటుంబాలు ఆధారపడ్డాయని హఠాత్తుగా ఫ్లెక్స్ లు నిషేధిస్తే వీరంతా ఏమవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో అయితే 18వందల మిషన్లు ఉన్నాయన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకూ విస్తరించిన ఫ్లెక్స్ లపై ఆధారపడిన చాలా కుటుంబాలు ఇబ్బందుల్లో పడతాయన్నారు. వాస్తవానికి ఫ్లెక్స్ ప్లాస్టిక్ కాదని బుడ్డిగ రాధాకృష్ణ చెబుతూ క్లాత్ పైన ప్లాస్టిక్ లేయర్ మాత్రమే వస్తుందని అన్నారు. ఓ చిన్న ఫ్లెక్స్ వేసుకోవాలంటే 292రూపాయలతో సరిపోతుందని, అదే క్లాత్ తో అయితే వెయ్యి రూపాయల పైనే అవుతుందని అయన పేర్కొన్నారు. అయినా ఇప్పటికిప్పుడు క్లాత్ మీద ముద్రించాలంటే మిషన్లు మార్చాలని, ఇవన్నీ అయ్యే పనికాదని ఆయన పేర్కొన్నారు. అందుకే నిషేధం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఫ్లెక్స్ ల నిషేధానికి నిరసనగా రాజకీయ నాయకుల ఫ్లెక్స్ లు వేయకూడదని భావిస్తున్నామని చెప్పారు. ఈనెల 29వ తేదీ సోమవారం ఉదయం కోటిపల్లి బస్టాండ్ నుంచి ఫ్లెక్స్ కార్మికులతో ర్యాలీ నిర్వహిస్తామని, ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తామని బుడ్డిగ రాధా చెప్పారు. రాజమండ్రి ఫ్లెక్స్ ప్రింటర్స్ ఓనర్స్ అసోసియేషన్ సెక్రటరీ పెప్సీ కుమార్, కోశాధికారి కంకటాల నగేష్, ఉపాధ్యక్షులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వై కృష్ణారావు, నగర జాయింట్ సెక్రటరీలు జమ్మా రాజారమేష్, ఏ ఉమామహేష్, సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.